PM’s opening remarks at the 6th Governing Council Meeting of NITI Aayog

PM’s opening remarks at the 6th Governing Council Meeting of NITI Aayog

నీతి ఆయోగ్‌ పాలకమండలి 6వ సమావేశంలో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం
కేంద్ర-రాష్ట్రాల మధ్య సహకారం చాలా ముఖ్యం: ప్రధానమంత్రి

గరిష్ఠ పెట్టుబడుల ఆకర్షణకు పీఎల్‌ఐ పథకాన్ని
సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రాలకు పిలుపు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ నీతి ఆయోగ్‌ పాలకమండలి 6వ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. దేశ ప్రగతికి ప్రాతిపదిక సహకార సమాఖ్య తత్వమేనని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు.

దీన్ని మరింత అర్థవంతం చేయగల పోటీతత్వ సహకార సమాఖ్య దిశగా మళ్లడంపై మేధోమధనమే ఈ సమావేశం లక్ష్యమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేయడంవల్లే కరోనా మహమ్మారి గడ్డు పరిస్థితిని దేశం యావత్తూ అధిగమించగలిగిందని ఆయన చెప్పారు.

ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత ప్రయోజనాలే పరమావధిగా నేటి సమావేశ చర్చనీయాంశాలను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

   ప్రతి పేద పౌరుడికీ పక్కా గృహవసతి కల్పించే ఉద్యమం ప్రస్తుతం కొనసాగుతున్నదని ప్రధాని చెప్పారు. దేశంలోని పట్టణాలు, గ్రామాల్లో 2014 నుంచి ఇప్పటిదాకా 2కోట్ల 40 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు.

అలాగే జల్‌జీవన్‌ మిషన్‌ ప్రారంభించాక కేవలం 18 నెలల్లోనే 3.5 లక్షల గ్రామీణ నివాసాలకు కొళాయిలద్వారా తాగునీటి సరఫరా సౌకర్యం ఏర్పడిందన్నారు.

ఇక ఇంటర్నెట్‌తో గ్రామీణ అనుసంధానానికి ఉద్దేశించిన ‘భారత్‌ నెట్‌’ పథకం పెను మార్పులకు మాధ్యమం కానుందని ఆయన వివరించారు. ఇటువంటి పథకాలన్నిటి అమలులో కేంద్ర-రాష్ట్రాలు సమష్టిగా కృషిచేస్తే పనుల వేగం కూడా పెరుగుతుందన్నారు.

తద్వారా చిట్టచివరి వ్యక్తి వరకూ ప్రయోజనాలు అందుతాయని చెప్పారు.

Join us on Facebook

   ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌పై సానుకూల ప్రతిస్పందన దేశం మనోభావాలను సుస్పష్టం చేసిందని ప్రధాని అన్నారు. ఆ మేరకు వేగంగా ముందడుగు వేయాలని, ఇక సమయాన్ని ఎంతమాత్రం వృథా చేయరాదన్న దృఢ నిర్ణయానికి వచ్చిందని అభివర్ణించారు.

దేశం ప్రారంభించిన ఈ ప్రగతి పయనంలో భాగస్వామ్యానికి ప్రైవేటు రంగం కూడా ఉత్సాహంతో ముందుకొస్తున్నదని ఆయన చెప్పారు. ఈ నవ్యోత్సాహాన్ని, ప్రైవేటురంగం శక్తిని ప్రభుత్వం తనవంతుగా గౌరవిస్తూ స్వయం సమృద్ధ భారతం ఉద్యమంలో వీలైనంత ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్నారు.

దేశ అవసరాల కోసమేగాక ప్రపంచం కోసం కూడా ఉత్పత్తి చేయగలిగేలా భారత్‌ అభివృద్ధి చెందడమేగాక అంతర్జాతీయ పరీక్షా సమయాన్ని ఎదుర్కొనడానికి కూడా స్వయం సమృద్ధ భారత ఉద్యమం ఒక మార్గమని స్పష్టం చేశారు.

   భారత్‌ వంటి తరుణదేశపు ఆకాంక్షల దృష్ట్యా ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టాలని ప్రధానమంత్రి చెప్పారు. ఆవిష్కరణలకు ప్రోత్సాహంతోపాటు విద్యా, నైపుణ్య రంగాల్లో మెరుగైన అవకాశాల కల్పన కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరగాలన్నారు.

దేశంలో వ్యాపారాలు, ఎంఎస్‌ఎంఈ, అంకుర సంస్థల బలోపేతం అవసరాన్ని నొక్కిచెప్పారు. దేశంలోని వందలాది జిల్లాల్లో ఉత్పత్తుల ప్రత్యేకత మేరకు వాటిని ప్రోత్సహించడంద్వారా రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీ ఏర్పడిందని ఆయన వివరించారు.

ఈ విధానాన్ని మండలాల స్థాయికి విస్తరించి రాష్ట్రాల్లోని వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాలనుంచి ఎగుమతులను పెంచాలని ఆయన సూచించారు.

కేంద్రం-రాష్ట్రాల మధ్య మెరుగైన సమన్వయంతోపాటు విధాన చట్రం ఉండాల్సిన ప్రాముఖ్యాన్ని ఆయన నొక్కి చెప్పారు.

   వివిధ రంగాల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక’ (పీఎల్‌ఐ) పథకాలు ప్రకటించిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. దేశంలో ఉత్పాదకత పెంపునకు ఇదొక అద్భుతమైన అవకాశమని ఆయన చెప్పారు.

ఈ పథకాన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయిగా వినియోగించుకుని గరిష్ఠ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించాలని, అలాగే కార్పొరేట్‌ పన్నుల శాతం తగ్గింపు నుంచి లబ్ధి పొందాలని కోరారు.

ఈ బడ్జెట్‌లో మౌలికవసతుల రంగానికి నిధుల కేటాయింపును ప్రస్తావిస్తూ- ఇది అనేకస్థాయులలో దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో తోడ్పడుతుందని ప్రధానమంత్రి చెప్పారు.

రాష్ట్రాలు స్వావలంబన సాధించడమేగాక తమ బడ్జెట్లలో అభివృద్ధికి ఊపునివ్వాల్సిన ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పారు.

ఇక 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు స్థానిక పాలన సంస్థలకు ఆర్థిక వనరులను భారీగా పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు.

స్థానిక పరిపాలన సంస్కరణలలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతోపాటు ప్రజా భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

   వంటనూనెల దిగుమతికి సుమారు రూ.65,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని, వాస్తవానికి ఇది మన రైతులకు చెందాల్సినదని ప్రధానమంత్రి చెప్పారు.

అదేవిధంగా అనేక వ్యవసాయ ఉత్పత్తులను దేశ అవసరాల కోసమేగాక ప్రపంచానికి సరఫరా చేయడం కోసం కూడా ఉత్పత్తి చేయవచ్చునని అన్నారు.

ఇందుకోసం, అన్ని రాష్ట్రాలూ ప్రాంతీయ వ్యవసాయ-వాతావరణ ప్రణాళిక వ్యూహాన్ని రూపొందించాల్సి ఉందన్నారు.

వ్యవసాయం నుంచి పశుసంవర్ధనందాకా,  మత్స్య పరిశ్రమ వరకూ సమగ్ర విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తున్నదని ఆయన చెప్పారు.

ఈ కారణంగానే కరోనా సమయంలో కూడా దేశ వ్యవసాయ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని తెలిపారు.

వ్యవసాయ ఉత్పత్తుల వృథాను అరికట్టేందుకు వాటి నిల్వ, శుద్ధి ప్రక్రియపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి కోరారు.

లాభార్జన కోసం  ముడి ఆహార పదార్థాలు కాకుండా తయారుచేసిన ఉత్పత్తులను ఎగుమతి చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

మన రైతులకు అవసరమైన ఆర్థిక వనరులు, మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావాలంటే సంస్కరణలు చాలా ముఖ్యమన్నారు.

Join us on YouTube

   ఇటీవల ఓఎస్‌పీ నిబంధనల్లో సంస్కరణలు తేవడంవల్ల మన యువతరం ఎక్కడినుంచైనా పనిచేయగల సౌలభ్యం ఏర్పడటమేగాక సాంకేతిక రంగానికి ఎంతో ప్రయోజనం కలిగిందన్నారు.

అనేక ఆంక్షలు తొలగించబడిన క్రమంలో భౌగోళిక సమాచారంపై మార్గదర్శకాలను ఇటీవలే సడలించామని ఆయన గుర్తుచేశారు.

దీంతో మన దేశంలోని అంకుర సంస్థలతోపాటు సాంకేతిక రంగానికి తోడ్పాటుసహా సామాన్యులకు జీవన సౌలభ్యం మెరుగుపడుతుందని వివరించారు.

Government is committed to support innovative ideas and sustainable solutions in food processing, says Shri Rameswar Teli