భారత జీ.డీ.పీ. పయనం ఎటువైపు? Where is the GDP Headed Towards?
2021 ఆర్ధిక సంవత్సరానికి గానూ భారత జీ.డీ.పీ. వృధ్ధిరేటు సున్నాగా మిగలనుందా అంటే, అవుననే అంటున్నాయి అంతర్జాతీయ రేటింగు సంస్థ మూడీస్ ముందస్తు అంచనాలు.
ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి చేయబడ్డ అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువనే స్థూల దేశీయోత్పత్తి (Gross Domestic Product -GDP) అంటారు.
ఇటీవల మూడీస్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం 2021 ఆర్ధిక సంవత్సరంలో భారత జీ.డీ.పీ. కుదేలవడమే కాక ద్రవ్య లోటు కూడా భారీగా ఉండనున్నటు పేర్కొంది.
పెరిగిన ప్రభుత్వ రుణాలు, క్షీణించిన మౌలిక సదుపాయాలకు తోడు, బలహీన పడుతున్న ఆర్ధిక వ్యవస్థ సైతం జీ.డీ.పీ. పైన తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు మూడీస్ తన నివేదికలో పేర్కొంది.
గత నెల మూడీస్ భారత జీ.డీ.పీ. వృద్ధిరేటు 0.2 శాతంగా ఉండనున్నట్ల తన నివేదికలో పేర్కొన్నప్పటికి, తాజా పరిణానాల దృష్ట్యా ఈ సవరించిన అంచనాలను ప్రకటించింది.
చదవండి: ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ
ఇటీవలి సంవత్సరాలలో భారతదేశ ఆర్థిక వృద్ధి క్షీణించినట్లు తెలుస్తుంది.
ఇది గ్రామీణ గృహ రంగంలో నెలకొన్న ఆర్థిక ఒడిదుడుకులు, క్షీణంచిన ఉత్పాదకత, మరియు బలహీనమైన ఉద్యోగ కల్పన వంటి ఇతర పరిణామాల వల్ల ఎర్పడ్డ పరిస్థితిగా మూడీస్ పేర్కొంది.
2021 ఆర్ధిక సంవత్సరంలో ఆర్ధిక కార్యకలాపలు స్తబ్దుగా ఉండటం వల్ల, జీ.డీ.పీ. వృద్ధి సున్నాగా ఉన్నప్పటికి, 2022లో జీ.డీ.పీ. వృద్ధి రేటు 6.6 శాతంగా ఉండనున్నట్లు మూడీస్ అంచనా వేసింది.
ఇప్పటికే మందగించిన ఆర్ధిక వృద్ధి, COVID-19 ప్రభావంతో మరింత క్షీణించనున్నట్లు మూడీస్ పేర్కొంది. ఇది ఆర్ధిక స్థిరీకరణపై తీవ్ర ప్రతికూలతను ప్రదర్శించనుంది.
కరోనా మహమ్మారి కట్టడికి పాటించిన లాక్డౌన్ కారణంగా తలెత్తిన సంక్షోభం వల్ల, ఆర్ధిక వృద్ధిలో 2శాతం మేర క్షీణత ఉండనున్నట్లు మూడీస్ స్థానిక అనుబంద సంస్థ ICRA పేర్కొంది.
మెక్ కిన్సే అండ్ కంపెనీ కరోనా లాక్డౌన్ కారణంగా భారత దేశంలో మందగించిన ఆర్ధిక కార్యకలాపాలపై మరో నివేదిక విడుదల చేసింది.
లాక్డౌన్ ప్రభావంతో దాదాపు 18కోట్ల మంది వ్యవసాయేతర రంగ కార్మికులు నిరుద్యోగులుగా మారారు.
దాని ప్రభావంతో గత 6 వారలలో ఆర్ధిక కార్యకలాపలు సాధారణ పరిస్థితులతో పొలిస్తే కేవలం 49-57 శాతం మాత్రమే జరిగినట్లు ఈ నివేదికలో పేర్కొంది.
ఆర్ధిక వ్యవస్థపై లాక్డౌన్ ప్రభావం
లాక్డౌన్ ఆరంభంలో ఈ ఆర్ధిక మందగమనం అనివార్యమైనప్పటికి, దీర్ఘకాలంలో మాత్రం ఇది పెనుభారంగా మారే ప్రమాదముంది.
జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే, కరోనా మహమ్మారి నుండి సమీప కాలంలో విముక్తి కనబడదని సుస్పష్టంగా అర్ధమౌతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహమ్మారి కట్టడికి తీస్కునే చర్యలకు సమాంతరంగా, ఆర్ధిక వ్యవస్థను గాడిన పడేసే చర్యలు సైతం తప్పనిసరి.
వీటన్నింటినీ గమనిస్తే భారత ఆర్ధిక అభివృద్ధి మరియు రుణ సామర్ధ్యం సమీప భవిష్యత్తులో అంత ఆశాజనకంగా లేనట్లుగా మూడీస్ అందించిన నివేదికను బట్టి తెలుస్తుంది.