బడ్జెట్‌ విశేషాలు తెలుసా!!

బడ్జెట్‌ విశేషాలు తెలుసా!!

కేంద్ర బడ్జెట్‌ ఏటా మార్పులు సంతరించుకుంటూ వస్తోంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఈ మార్పులు సహజమైపోయాయి. అప్పటి వరకు ఫిబ్రవరి నెల చివరి రోజు బడ్జెట్‌ ప్రవేశ పెట్టే సంస్కృతి 2017లో తొలిసారి మారింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే సంప్రదాయం ప్రారంభమైంది. అదే ఏడాది రైల్వే బడ్జెట్‌ సైతం విలీనం అయ్యింది. మోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక సూట్‌ కేస్‌ సంస్కృతికి చరమగీతం పాడుతూ వస్త్రంతో కూడిన బ్యాగులో ప్రతులను తీసుకొచ్చి 2019లో తొలిసారి కొత్త పంథాను అనుసరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌. అలాగే ఈ సారి (2021-22) బడ్జెట్‌లో సైతం కీలకమైన మార్పు చోటుచేసుకుంటోంది. అదే బడ్జెట్‌ పత్రాల ముద్రణ! కొవిడ్‌ నేపథ్యంలో ఈ సారి ముద్రణను నిలిపివేశారు. దీంతో బడ్జెట్‌ ప్రతులను పార్లమెంట్‌ సభ్యులందరికీ ఎలక్ట్రానిక్‌ రూపంలో అందజేయనున్నారు. అలాగే ఈ సారి బడ్జెట్‌ కోసం ప్రత్యేక యాప్‌ను సైతం కేంద్రం తీసుకొచ్చింది.

నిడివిలో తెలుగింటి కోడలిదే రికార్డు..

బడ్జెట్‌ ప్రసంగం విషయంలో నిర్మలా సీతారామన్‌ది అరుదైన రికార్డు. గతేడాది ప్రవేశపెట్టిన (2020-21) బడ్జెట్‌ సందర్భంగా ఆమె ఏకంగా 2 గంటల 39 నిమిషాల పాటు ప్రసంగించారు. అనారోగ్యం కారణంగా రెండు పేజీలు ఉండగానే తన ప్రసంగాన్ని ముగించారు. లేదంటే నిడివి మరింత పెరిగేది. అంతకుముందు 2019లో ఆమె సైతం 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సారి ఆ రికార్డు చెరిపేస్తారా? చూడాలి మరి!!

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 1991 సమయంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆయువు పట్టుగా నిలిచిన ఈ కీలక సమయంలో ఆయన బడ్జెట్‌ ప్రసంగం నిడివి 18,650 పదాలు. ఆ సమయంలో ఆయన చదివిన బడ్జెట్‌ ప్రసంగం నిడివే అప్పటి వరకు పెద్దది.
వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసిన జశ్వంత్‌ సింగ్‌ 2003లో బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. ఆయన ప్రసంగం 2 గంటల 13 నిమిషాల పాటు సాగింది. అప్పటికి అదో రికార్డు.

ఎక్కువ సార్లు వీళ్లే..

ఎక్కువ సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్‌కే దక్కుతుంది. ఆయన 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
కేంద్ర ఆర్థికమంత్రిగా పి. చిదంబరం తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గతంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన సమయంలో పార్లమెంట్‌లో ఎనిమిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఇతర విశేషాలు..

స్వాతంత్ర్యానంతరం 1947 నవంబర్‌ 27న పార్లమెంట్‌లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆర్‌కే షణ్ముఖం చెట్టిదే. ఆ బడ్జెట్‌ నిడివి కేవలం 39 పేరాలు.

దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రిగా ఇందిరా గాంధీ రికార్డు సృష్టించారు. మళ్లీ ఆ ఘనత నిర్మలా సీతారామన్‌కే దక్కింది.

కేంద్ర ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌లు ప్రవేశపెట్టి అనంతర కాలంలో రాష్ట్రపతి పదవిని అధిష్టించినవారు ఇద్దరున్నారు. 1980-82 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆర్.వెంకట్రామన్, 1982-84, 2009-12 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టారు.